పద్యపూరణలు

పద్య పూరణలు (అవధానం)
తేది 19-06-2020,  శుక్రవారం 

పూరిస్తున్నవారు :  శ్రీమతి చుక్కాయపల్లి శ్రేదేవి గారు 


నిర్వహణ :శ్రీ గోగులపాటి కృష్ణమోహన్ గారు

అంశాలు - పృచ్ఛకులు 
1 సమస్య - పద్మ చిగురాల గారు 
2 అంత్యాద్యక్షరి - జ్ఞాన ప్రసూనా శర్మ గారు 
3 దృశ్యం - లక్ష్మీమదన్ గారు 
4 దత్తపది - లక్ష్మీ పద్మజ గారు 
5 న్యస్తాక్షరి - మణిమాల గారు 
6 అశువు - గాయత్రి గారు 
7 నిషిద్ధాక్షరి - సంధ్యారాణి గారు 
8 వర్ణన - హరిణా పవన్ గారు

నేటి 62వ ఆన్లైన్ అష్టావధానానికి సుస్వాగతం

ప్రార్థన

అందెలు ఘల్లని మ్రోగగ
చిందులు వేయు చును‌ కొంటె చేష్టలతోడన్
విందారగించు వెన్నుని
సుందరమౌ మోముగాంచు శుభమెన్నటికో!

కడవల వెన్నల గ్రోలుచు
నడవలలో‌ నాట్యమాడు‌ నవ్వుల రేడున్
సుడివడి తిరిగెడి నడకల
గడబిడలే గాంచి మురియు సంతసమెపుడో!



సమస్య 
పద్మ చిగురాల గారు 

అవధాని గారికి నమస్కారం🙏🏻🌹
నా పేరు పద్మ చిగురాల...
అంశం సమస్య:
కదలకయున్నచో పెరుగు కండలు క్రొవ్వును దేహమందునన్..!
           . . 🙏🏻..
వదలక సోమరుల్ బహుళ వాంఛలు గల్గి నిరంతరంబుగన్
కొదవయెలేని కోర్కెలతొ కొత్త రుచులల్ గను తిండి పోతులై
మెదలకనుండి కాయమును మేపుచునుండగ చిక్కిపోదురా?
కదలక యున్నచో పెరుగు కండలు క్రొవ్వును దేహమందునన్


దత్తపది - 
లక్ష్మీ పద్మజ గారు 

సభకు నమస్కారం 
నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు 
నేటి అవధాని వర్యులు శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారికి నమస్సులు 🙏
ఈరోజు అవధానంలో 
నాకు కేటాయించిన  అంశం *దత్తపది* 

జాజి 
మల్లె 
గులాబీ 
సంపెంగ 
పూలను ఉపయోగిస్తూ 
సరస్వతి అమ్మవారి  పూజించడం మీద పద్యం చెప్పండి,  స్వేచ్చా చందం లో,,,, ధన్యవాదములు

దత్తపది
నీ చిరునవ్వులె జాజులు
కాచెడి నీ దయయె మల్లె కాంతులు చిందున్
వీచు గులాబీ గంధము
నీచక్కని నాసికమ్మె నిట సంపంగౌ


వర్ణన - 
హరిణా పవన్ గారు

శ్రీ గుగులపాటి కృష్ణ మోహన్ గారి సహృదయ సారధ్యంలో జరుగుతున్న (మరో మారు)మహిళా అవధానం లోకి స్వాగతం సుస్వాగతం💐వారికివే వందనములు🙏
మహిళామణి మన నేటి
 🌹అవధాని శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారికి ఇదే నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏
🌹పృచ్ఛక గణంలోని నా ప్రియాతి ప్రియమైన సోదరీమణులకు అభినందన వందనములు🙏

నాపేరు:హరిణాపవన్ .కొరిడె
అంశం:వర్ణన

ఒక నాలాంటి ఇల్లాలు అమ్మవారి పూజలో భాగంగా అష్టోత్తర నామాలతో పాటు కోరికల చిట్టా చదువుతుంది.అపుడు అమ్మవారు పొందే మానసిక స్థితిని వర్ణించ ప్రార్థన.ఇష్ట చంధస్సులో ...🙏🙏


వర్ణన
నిరతము నిత్య పూజలలొ నిర్మల చిత్తము తోడ శ్రీమతుల్
కరములు మోడ్చి మ్రొక్కెదరుగా  తమ వారల క్షేమ కాంక్షచే
కొరవడవేవి నాదయన, కోరిక మీరగ నన్ను నమ్మినన్
సరళములైన జీవితము సాధ్య పడున్ గద శంకలేలనో !


నిషిద్ధాక్షరి - 
సింగీతం సంధ్యారాణి గారు

అవధాని గారికి, మరియు నిర్వహకులు కృష్ణ మోహన్ గారికి నమస్కారములు 
నాపేరు: సింగీతం సంధ్యారాణి
అంశం: నిషిిద్దాక్షరి
క గ స మ అనే అక్షరాలను నిషేధిస్తూ, గిరిజనులు దేవతగా ఆరాధించే సమ్మక్క వీరోచిత పోరాటము గురించి స్వేచ్చా చందం లో చక్కని పద్యం చెప్పగలరని మనవి

నిషిద్ధాక్షరి
చరిత నిలిపెడి చక్కనౌశక్తి జూప,
బ్రిటిషు యోధుల నెదిరించు బింక మందు
ఆడబిడ్డలు నిద్దరున్ జోడు గాను
నిలిచి దేవతలైరిగా కొలుతుమిపుడు


దృశ్యం - లక్ష్మీమదన్ గారు

అవధాన సరస్వతి శ్రీమతి చుక్కాయ పల్లి శ్రీ దేవి గారికి నమస్కారము! 
నిర్వాహకులు శ్రీ గోగులపాటి కృష్ణ మోహన్ గారికి నమస్కారము!

నా పేరు లక్ష్మి

నాకు ఇచ్చిన అంశం దృశ్యం..
పై దృశ్యం చూసి రాముడు సీతమ్మ వారి మధ్య ఉన్న ప్రణయ సంభాషణను ఉత్పల మాలలో వివరించండి!

ధన్యవాదములు 🙏



దృశ్యానికి పద్యం
చక్కగ దున్ని విత్తులను చల్లినచో మొలకెత్తు గాని, మీ
దిక్కున నేల దున్నగనె తేరగ పిల్లలు బుట్టు చుండిరే!
అక్క జమాయె పాయసము నందున నెట్టుల దాగి యుండిరో!
గ్రక్కున త్రాగినంత మరి కాంతలు గర్భము దాల్చు టెట్టులో?




అశువు - ముత్యంపేట గాయత్రీ దేవి 

అవధానిని శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవిగారికి నమస్కారములు! 
నాపేరు:_ ముత్యంపేట గాయత్రీ దేవి 
నా అంశం   ఆశువు 
నదీమతల్లిని తల్లితో పోలుస్తూ ఆశువుగా చెప్పండి! 
ధన్యవాదాలు🙏😊

ఆశువు
తమ సంతానము క్షేమ గాములుగ నిత్యమ్మున్ యశోవృద్ధికై
సమయమ్మంతయు గూర్చునట్లు నదులే శ్రాంతిన్ సదా నిల్పగన్
సమయోద్ధారక మౌచు బారి జగతిన్ సంరక్షణల్ సేయుచున్
విమలంబౌ పలురీతులౌ నడకలన్ విచ్చేయు స్వచ్ఛంబుగన్

న్యస్తాక్షరి  1
గోగులపాటి కృష్ణమోహన్ 

*సైనికుడు* అక్షరాలను నాలుగు పాదాల్లో వాడుతూ...  సరిహద్దులోని సైనికుని వీరమరణం, తల్లి ఆత్మస్థయిర్యం  స్వేచ్చా ఛందంలో వర్ణించండి


న్యస్తాక్షరి 1

తల్లి సైనికుడగుమంచు దీవెనొసగ
తిరగబడె సైనికుడు కడు తీక్ష్ణముగను
పోరు సైనికుడంతలో చేరె దివిని
సైనికుడి మరణ మాతల్లి సైపదయ్యొ


న్యస్తాక్షరి - ముదిగొండ మణిమాల గారు 

న్యస్తాక్షరి 2
శ్రీమతి ముదిగొండ మణిమాల 

నిర్వాహకులు గోగులపాటి కృష్ణ మోహన్ గారికి మరియు 60 అవధానాలు పూర్తి చేసుకొని ముందుకు వెళ్తున్న అటువంటి అవధాని శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారికి నమస్సుమాంజలులు 

ఈ కార్యక్రమంలో నాకు అందించినటువంటి అంశం న్యస్తాక్షరి 

ఈ వేసవి కాలంలో ఆవకాయ రుచి అందరికీ తెలిసిన అటువంటిది. 

కాబట్టి చంపకమాల వృత్తంలో, 
1వ పాదంలోని 5వ అక్షరం ఆ, 
2వ పాదం లోని 6వ అక్షరం వ,  
3వ పాదం లోని 7వ అక్షరం కా, 
4వ పాదం లోని 8 వ అక్షరం య. 

వచ్చేలా పద్యపూరణ చేయగలరు 

న్యస్తాక్షరి

తలచుచు నావకాయరుచి తన్మయమౌనటు లారగించగన్,
సులువుగ‌ నావచూర్ణమును,చూతములన్ లవణమ్ము దెచ్చి,మీ
నెలవున మిర్పకాయపొడి,నిండుగ‌ నింగువ కొబ్బెరల్ భళా
కొలతలతోడ వేయగను, కూర్చుము పోపును పస్పునంతటన్


అంత్యాద్యక్షరి - జ్ఞాన ప్రసూనా శర్మ గారు


అంత్యాద్యక్షరి 

శ్రీమతి జ్ఞానప్రసూన శర్మ 

మానవీయత చాటి మహనీయుడైనట్టి
         మనగాంధి జన్మించె జనులకొరకు
బందీగమారిన భారతమాతకు
         స్వేచ్ఛనుసాధించి సేదతీర్చె
ఆడంబరము వీడి ఔదార్యమునుజూపి
          బడుగు జీవులపాలి బంధువాయె
కొల్లాయి ధరియించి కోరికలుత్యజించి   
           సాధుజీవనమున సఫలుడాయె   
ఉప్పు సత్యాగ్రహం బొప్పుగా చేపట్టి
           మెప్పుపొందినయట్టి  మేటియతడు 
ఆంగ్లేయ పాలన  నంతమొందించగ     
             హింసనువిడనాడి హితముగూర్చి
రాముడై కృష్ణుడై రాజ్యహితముగోరి
                సంగ్రామ రంగాన జయమునొందె

తే. గీ
******

భరతమాతకు బిడ్డడై  వాసిగాంచె
నిత్య సంస్కార శోభిత నియమశీలి
సత్యవచనము లాడెడి శాంతమూర్తి 
విశ్వమంతయు మెచ్చిన విజ్ఞుడతడు
**************************


అంత్యాద్యక్షరి

డుబుకున మున్గెను ఘటమా
విబుధుడు శ్రవణుండడవిన భీతిగొనంగన్
గబుకున విడిచెను ప్రాణము
సబబాయని నిందలిడిరి చయ్యన‌ వృద్ధుల్



అభినందనలు 
ఎనమండుగురీ రీతిగ
ఘనశోభను గూర్చుచుండ,కలిగెను ముదమే
జనియించిన యీ ప్రశ్నలు
తనరింపగ జేసె గాద ,తమచిత్తముతోన్
శ్రీమతి చుక్కాయపల్లి శ్రేదేవి గారు 


🌹🍀🌹
కం.
చక్కని వేదిక యిదియే
మక్కువతోకృష్ణ గారు మహిళల కొరకై
చుక్కాయపల్లి వారిని
చక్కంగ బిలిచె సుదినము సఖియలుగనరే...!
   .........పద్మ చిగురాల.🌿


యెనిమిదియంశమ్ముల స
ద్వినయముతోపద్యములను వేగమునందన్! 
ఘనముగయీయవధానము 
నొననరించినమీకు నతులునోఅక్కయ్యా! 🙏🙏🙏
ముత్యంపేట గాయత్రీ దేవి 

Comments

  1. నిషిద్ధాక్షరిలో...
    క్క,క,మం,గా,మి , నిషేధము గదా!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

చుక్కాయపల్లి శ్రీదేవి గారి పద్య పూరణలు

అవధాని బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారి పద్యపూరణలు