శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి పద్యపూరణలు 2

పద్యపూరణలు...2
తేది: 24-06-2019, శుక్రవారం



పూరణ చేయువారు: 
శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు

సమన్వయం
గోగులపాటి కృష్ణమోహన్

అంశాలు:

1.నిషిద్దాక్షరి: గోగులపాటి కృష్ణమోహన్

2.సమస్య : గోగులపాటి కృష్ణమోహన్

3.దత్తపది:రామక కృష్ణమూర్తి గారు

4.వర్ణన: రమాదేవి కులకర్ణి గారు

5.ఛందోభాషణ: సరస్వతీ రామశర్మ గారు

6 న్యస్థాక్షరి: సరస్వతీ రామశర్మ గారు

7.దృశ్యం : లక్ష్మీ మదన్ గారు

8.ఆశువు : సింగీతం నరసింహారావు గారు


1) అంశం- నిషిద్ధాక్షరి
గోగులపాటి కృష్ణమోహన్

హిమాలయములు.
నిషిద్ధాక్షరము - మ
ఛందస్సు - కందము

పూరణ నిషిద్ధాక్షరి

తెల్లని కాంతుల నగములు
యల్లన భారతికి నుదుట నలరెడు నగయై
చల్లని శశికిరణంబై
వెల్లువయౌ సంతసముల వేడుకనొసగున్


2) అంశం: సమస్య
గోగులపాటి కృష్ణమోహన్

సమస్యాపూరణం

వర్షధారలెల్ల హర్షము గూర్చగా
వీడు వీడు వీడ, వాడు వీడ
పొట్టకూటి కొరకు తట్టబట్టువారు
పల్లెబాట సాగిరుల్లసముగ

వీడు.....విడవడం; వీడు...పట్టణం


3) అంశం: దత్తపది
డా.రామక కృష్ణమూర్తి

జయసుధ, జయప్రద, జయలక్ష్మి, జయచిత్ర-భారతార్థము-స్వేచ్ఛా వృత్తం

పూరణ: దత్తపది

విజయసుధలెల్ల వేడుకన్ విశ్వమందు
పాండవుల కాంక్షలే జయప్రదముగాగ
వలచె జయలక్ష్మి పోరునన్ పరవశించి
భువిని జయచిత్రమై వెలిగె పూర్ణమగుచు


4) అంశం: వర్ణన
రమాదేవికులకర్ణి

నాటి కురుసభలో  దుశ్యాసనుడు  ద్రోపది  చీరలాగి  స్త్రీని  అవమానించాడు  ఫలితం కురువంశ  నాశనం 
నేడు అడుగడుగునా దుశ్యాసనులు  ఆదుకునే కృష్ణులు, బుద్దిచెప్పె  భీమసేనులు లేరు ....దీనిని వర్ణిస్తూ ...నేటి స్త్రీకి  రక్షణను  సూచించండి 


పూరణ: వర్ణన

పూరణ1)
తరుణుల వస్త్రవిధానము
పరిపుష్ఠిగ గౌరవంబు పంచగవలయున్
దరిజేరనీకు ముగ్ధత
వెరవక ధైర్యము బూనుచు వెలుగుము భువిలోన్

పూరణ 2)
కత్తులు దూసి పాండవులు కౌరవుల న్ దునుమాడలేనియా
పత్తున నున్న, దుష్టులట పావన మూర్తిని గేలిసేయుచున్
విత్తులునాటిరీ విషము, వీరశిరోమణులైచు నంగనల్
మెత్తగ లొంగకున్న శృతి మించిన మూకను మట్టుబెట్టగన్
సత్తువ బూని చట్టముల సాయముతో నెదిరింపగావలెన్


5) ఆంశం ఛందోభాషణం
సరస్వతీ రామశర్మ

పూరణ: ఛందోభాషణం
భావితరాలకందవలె పావనమైనటువంటి వేదముల్
మా విమలాంతరంగమున మీనము మేషము లెక్కజేయకన్
కోవెలలోన దైవమును గోరినయట్లుగ మీమదీనదీ
భావన ధారయై తరలి పావనమై నుతినొంద గావలెన్
భావన జలపాతమై తరలి పావనమై నుతినొందగావలెన్


6) అంశం న్యస్తాక్షరి
సరస్వతీ రామశర్మ

కా.మ ధే ను
పై అక్షరాలను ఆద్యక్షరాలుగా
ఆటవెలది లో...సాగరమథనం ప్రశస్తి.

పూరణ: న్యస్థాక్షరి

కాలసర్ప మచట కవ్వమునైయుండె
మదము ‌గూడె నసుర మానసంబు
ధేనువైనరీతి దేవతలెల్లరు
నుతిని బొందిరచట నేర్పుమీర


7) అంశం: దృశ్యము
లక్ష్మి మదన్

పై దృశ్యం లో పడవలు వదులుతున్న పిల్లల ఆనందాన్ని ఉత్పల మాల లో వర్ణించండి!


పూరణ: దృశ్యము

చిటపట రాలు వర్షమున చిందులు వేయుచు సంతసించుచున్
అటతృటి కాలమాగి తమయాటల దీటగు కాగితమ్ములన్
పటపట జింపుచున్ పడవబంపుచు, బుద్ధిగ పాఠశాలకున్
చిటపటలాడి సాగిరట చిత్తములెల్లయు నీటమున్గగన్

8) అంశం: ఆశువు
సింగీతం నర్సింహారావు

వేసవిసెలవులు పెంపు --పిల్లలహర్షం పై పద్యం


పూరణ: ఆశువు

కల్లలుగాదు సత్యమిది కౌతుకమింపెసలారు చుండెనీ
చల్లని వార్త వింటిమిక శారద మాతయె ప్రేమజూపగా
వెల్లువలయ్యె సంతసము వేడుకలే శృతి మించి సాగగన్
యెల్లరమాడి పాడుటకు  నింపగు స్నేహములోన దేలగన్


స్వస్తి వాక్కులు: 
సరసర పద్యములల్లెడి
తరుణములో విప్ర కవులు తాదాత్మ్యముగన్
త్వరపడి సాయము నొసగిరి
కరుణించెను శారదాంబ కవనపు సరమై

అభినందనలు: 
అమ్మామీపద్యములకు
కమ్మనినాపదములల్లి కైదండలగా
సొమ్ముగనాపదసంపద
నె,మ్మదిగానీపదముల  నానందముగా.

సరస్వతీ రామశర్మ

అభినందనలు
సోదరి చుక్కాయపల్లి శ్రీదేవి గారికి పద్యపూరణనుద్దేశించి సాహసపద్యధార.                                   
                       ధారణకల్గియేమరకతారనుబోలినతల్లివైనిటన్,
పూరణజేయగా తమదు పూజితహంసిని యిచ్చెనోపికన్,
తోరణగట్టు మేనిచట దోసిలియొగ్గుతు నిడ్వమేమిలన్,
కారణమేమొగాన కిలకాయితమెచ్చగ జెప్పిరేవినున్!
     -----సింగీతం నర్సింహారావు


కృతజ్ఙతలతో

నారీలోకము మురియగ
సాగెను మీ పద్యసుధలు పండిత సభలో
పేరునగల శ్రీదేవిగ
ధారగ సురగంగ వలెను ధాత్రిని కృష్ణా!!

కృతజ్ఙతలతో...
గోగులపాటి కృష్ణమోహన్
సమన్వయకర్త


Comments

  1. పద్యాలు చాలా అద్భుతంగా వచ్చాయి. సంతోషం! అభినందనలు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పద్యపూరణలు

చుక్కాయపల్లి శ్రీదేవి గారి పద్య పూరణలు

అవధాని బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారి పద్యపూరణలు