అయాచితం నటేశ్వర శర్మ గారిచే పద్యపూరణలు

 బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ  గారిచే
పద్యపూరణలు 



ఈ రోజు పద్యపూరణలు...4 వ రోజు
చేయువారు:
అవధాని బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ  గారు

సమన్వయం
గోగులపాటి కృష్ణమోహన్

అంశాలు:

1.నిషిద్దాక్షరి : గోగులపాటి కృష్ణమోహన్ గారు
2.సమస్య: రామక కృష్ణమూర్తి గారు
3.దత్తపది: చీదెళ్ళ సీతాలక్ష్మి గారు
4.వర్ణన: సింగీతం నరసింహారావు గారు
5.ఛందోభాషణ
6.అప్రస్తుతం 
7.దృశ్యం : సరస్వతి రామశర్మ గారు
8.ఆశువు.చుక్కాయపల్లి శ్రీదేవి గారు


అవధానిగారికి నమస్కారం!
సరసకవిత్వతత్త్వ రససాగరపారగసత్కవీంద్ర! మీ 
సురుచిర పద్య వైభవము సొంపునుగూర్చెసమూహమందునన్ 
అరయగమాదృశాదులకునాద్యులుమీరు సు సాహితీ రస 
స్వరములుమీకలమ్మునను సంస్కృతిదెల్పెభవద్గలమ్ము .హే నటే 
శ్వర!యవధానవర్య! కవి సంస్తుతిపాత్ర!నమోస్తు!సత్కృతీ!...నమస్సులతో...
భవదీయుడు. 
--- ముత్యంపేటగౌరీ శంకర శర్మ.


ప్రార్థన!
అయాచితం నటేశ్వర శర్మ

శ్రీమత్సంస్కృతభారతీయకవితాసిద్ధాంతహృద్వాసిత 
క్షేమానందమయస్వరూపమున మచ్చేతోవికాసమ్మువై 
ధీమాన్యంబగు కావ్యమార్గమున నన్ దీర్పన్ దయామూర్తివై 
రామారెడ్డిపురమ్ములో వెలుగు నిన్ బ్రార్థింతు విఘ్నేశ్వరా!

అరుణసుధాంశుబింబములు నద్వయమందినవో తపమ్ములున్ 
వరఫలరాజముల్ గలిగి భాసిలునో సకలైహికమ్ములౌ 
నిరుపమసౌఖ్యజాలములు నిండగు పుణ్యసుధాస్రవంతులై 
విరిసినవో యనన్ వెలుగు వేల్పుల గొల్తు నుమామహేశులన్!
---అయాచితం నటేశ్వర శర్మ

1) అంశం: నిషిద్ధాక్షరి
గోగులపాటి కృష్ణమోహన్

నిషిద్దాక్షరాలు: వ గుణింతం

విషయం: వేసవి తాపాన్ని స్వేచ్ఛా ఛందంలో తెలియజేయగలరు

పూరణ: నిషిద్ధాక్షరి:
భగభగమండుచు భానుడు 
భుగభుగమని పుక్కిలించు పొగలుగ నెండల్ 
సెగలకు డస్సిన జనతకు 
పగలును రాత్రిళ్లు నిద్ర భారంబయ్యెన్!


2) అంశం:సమస్య
పృచ్ఛకుడు: డా.రామక కృష్ణమూర్తి

సుర సేవించిన వారి కబ్బును సదా శోభావిశేషోన్నతుల్

పూరణ: సమస్య:
వరగద్యప్రభవాత్మమై రుచిరవాగ్భాబాణసంధానమై 
చిరకాలాఖిలసాహితీవిభవమై సేవ్యోపమానాత్మమై 
స్మరణీయోత్తమకావ్యమై వెలుగు విశ్వఖ్యాతకాదంబరీ 
సుర సేవించినవారికబ్బును సదా శోభావిశేషోన్నతుల్ !


3) అంశం..దత్తపది...
డా.చీదెళ్ల  సీతాలక్ష్మి
అరే,ఒరే, జరా, మారే ...పదాలనుపయోగించి గెలిచిన వారికి సంతోషం,ఓడినవారికి సంకటం...స్వేచ్ఛా ఛందము ...చెప్పప్రార్థన....


పూరణ: దత్తపది:
అరే! విచ్చె నీ పుష్పమాశ్చర్యరీతిన్?
ఒరే! భావిభాగ్యమ్ములోహో!వెలుంగున్!
జరాభారమా? చేయి జారంగ వాలెన్
కనన్ రాదు మారేటి కాలమ్ము నింతన్!!

4) అంశం: వర్ణన
సింగీతం నర్సింహారావు.

శ్రీకృష్ణుడు తన భర్త కావాలనికోరుతూ రుక్మిణి, పార్వతి మాతను స్తుతించినతీరుపై పద్యంచెప్ప మనవి.
పద్యము, స్వేఛ్ఛాఛందము

పూరణ: వర్ణన:
అమ్మవు నీవు మంగళములన్నియు నీ కడగంటి చూపులే 
యిమ్మహిలోని భాగ్యములకీవె నిధానము సర్వమంగళా!
నమ్మితి నన్ను కావుము సనాతన గృష్ణునితోడ నా వివా 
హమ్మునవిఘ్నతన్ జరుప నంజలిజేతు శివార్ధభాగినీ!


5) ఛందోభాషణం:
మాడుగుల మురళీధర శర్మ సిద్ధిపేట

భారత సంస్కృతీ విలువ భాసురమై యలరారు నెప్పుడున్
ధీరసుధీర ధారలగు దివ్యమనోజ్ఞత దీప్తినొందగా!
భారతి వెల్గుచున్నది సభామయమై కవితావిలాసతన్
శారదరాత్రులన్ నిలిపి సారసమన్వితవాక్యకేళులన్!

6) అంశం....దృశ్యం......
సరస్వతీ రామశర్మ

తులసీకళ్యాణమహోత్సవంలో...హాసినీ పాల్గొన్న సందర్భంలో తులసీమాత దీవెనలు ఇస్తున్నట్లు...స్వేచ్చా వృత్తంలో పద్యం అందిచగలరని మనవి

పూరణ: దృశ్యం:

తులసికి పెండ్లి చేసినది దోసిలియొగ్గుచు హాసచిత్తయై 
కలుషము బాపు నా తులసి కాంతుల గాచు సుహాసినిన్ సదా 
కలలిక పండు విద్యల వికాసము గల్గును దేవి సత్కృపన్ 
వెలుగును భావిజీవితము వెన్నెలవోలె మనోహరంబుగన్!


7) అంశం: ఆశువు
చుక్కాయపల్లి శ్రీదేవి

నూతన ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత భవిష్యత్తును ఊహిస్తూ
చంపకమాలలో‌ తెలపగలరని‌ కోరుతున్నాను

పూరణ: ఆశువు:
భారతమాతృసేవకయి భాగ్యవశమ్మున వచ్చె 'మోడి' తా
ధీరత నుగ్రతన్ దునుమ దీర్చును దేశసురక్ష సర్వదా 
పూరణజేయు కోరికల పూర్ణఫలమ్ములొసంగునింక యీ 
భారతభూమి వెల్గును ప్రపంచపటమ్మున నగ్రదేశమై!

కృతజ్ఞతాసమర్పణము!
🍁🍁🍁🍁🍁🍁🍁
గోగులపాటి  కృష్ణునికి కోరి వచింతు కృతజ్ఞతానతిన్ 
సాగగ జేయు నిత్యము సుసాహితి కేళుల బ్రోత్సహించుచున్ 
రాగము యోగముల్ గలిసి రమ్యతరమ్ముగ దీరె బృందమే 
స్వాగతమెల్లవేళ యని పండితపాళి నుతింతు బ్రేమతో!

శుభమస్తు!

డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ. 
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

అభిఙందనలు
🌹🙏🌹🙏🌹🙏
అమ్మకృపనుపొందియవధానవర్యులై
అందుకోండిమాదువందనములు
సభనుశుభములొసగుసారస్వతమ్ముగా
వెలయజేసినారు వేడుకొనగ..
🙏🌹🙏🌹🙏🌹
సరస్వతి రామశర్మ



అభినందన పద్యం.

ఆయాచితవర్యలు,సు
నాయాసముగావధాన వందిత ముగనే
శ్రేయముజూపెను విధిగా
మా,యంశాలనందు నవ్యతతోడన్

గోగులపాటి కృష్ణమోహన్
సమన్వయకర్త

స్వస్తి



Comments

  1. అవధానమ్ములుచేయుచున్ సతమునా*
    యాచించకుండగమీ!కవితాధారలనందజేయుచునుమా
    *కాశీస్సుమాలిచ్చుచున్!
    యవవకాశమ్ములనిచ్చుతీరుగనిమా కానందమున్ కల్గెగా!
    స్తవనీయమ్మగు నామీదుశక్తికిని! సాంష్టాంగదండమ్ములన

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

పద్యపూరణలు

చుక్కాయపల్లి శ్రీదేవి గారి పద్య పూరణలు

అవధాని బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారి పద్యపూరణలు