మాడుగుల భాస్కర్ శర్మ పద్యపూరణలు - 2

పద్యపూరణలు - 10

తేది: 31-05-2019

ఈ రోజుపద్యపూరణలు...
చేయువారు

మాడుగుల భాస్కర్ శర్మ గారు

సమన్వయం
గోగులపాటి కృష్ణమోహన్

అంశాలు

1.నిషిద్దాక్షరి...గోగులపాటి కృష్ణ మోహన్ గారు
2.సమస్య... రామక కృష్ణ మూర్తి గారు
3.దత్తపది... సింగీతం నరసింహారావు గారు
4.వర్ణన... వేదాంతం సురేష్ బాబు గారు
5.ఛందోభాషణ... మాడుగుల మురళీధరశర్మ గారు
6 న్యస్థాక్షరి... సరస్వతీ రామశర్మగారు
7.దృశ్యం... పద్మజారంగరాజుగారు
8.ఆశువు... సరస్వతీ రామశర్మగారు

ఓం శ్రీ మహా గణపతయేనమః
ఓం శ్రీ మహా సరస్వత్యైనమః
శ్రీ గురుభ్యోనమః

ప్రభువు గణాధినాథునిట
ప్రార్థన జేతు నవిఘ్నకర్తగన్
సభలకు ముందు పూజగొని సత్ఫలమీయగ సాటి యెవ్వరీ
యిభముఖ దేవతాగ్రణికి నిచ్చెద జోతలు భక్తితోడుతన్
ఉభయ సతీప్రయుక్తుడుగ బుద్ధియు సిద్ధియు తోడు నిల్వగన్

వీణాపాణికి బ్రహ్మసు
రాణికి కవితార్థమిచ్చు రాజీవముఖీ
వాణికృపాణి కి పన్నగ
వేణికి నావందనములు విధిగన్ గొనగన్

... మాడుగుల భాస్కర శర్మ


1) అంశం.....నిషిధ్ధాక్షరి
గోగులపాటి కృష్ణ మోహన్.

స రి గ మ
అక్షరాలు. నిషేధం తో
సంగీతం యెక్క.విలువ తెలుపగలరు... స్వేచ్ఛా ఛందం

పూరణ: నిషిద్ధాక్షరి

పాటల వీనులవిందును
పాటియెపాడించిచూడ ఫలితంబియ్యన్
పాటల లోకంబేదో
పాటించెడి ఛందవిధియె పావనమౌనే



2) అంశం: సమస్య
పృచ్ఛకుడు:డా.రామక కృష్ణమూర్తి

శుక్లాభ్రక్షరకాంతి ఖండికలహోశోభిల్లె నక్తంబులో

పూరణ: సమస్య

శుక్లైకాదశినాడు భక్తులచటన్ శ్లోకంబులన్ పాడుచున్
శుక్లాద్యాకృత శుక్లవర్ణ హరినే
చూడన్ వివేకమ్ముతో
శుక్లంబైన సునేత్రపద్మములనచ్చోటన్ నిమీలించగన్
శుక్లాభ్రక్షర కాంతిఖండికలహో శోభిల్లె నక్తంబులో.

3) అంశం: దత్తపది
గుణగుణ, సరసర,బిరబిర,ఛరఛర పదములతో  సరస్వతీ మాత ప్రార్థన.స్వఛ్ఛాఛందం

పూరణ: దత్తపది

పరిపరి విధముల గుణగుణ
సరసరమను రీతి పద్య సారస్వతమౌ
బిరబిర వాక్కుల ఛరఛర
ధరలోనందించు వాణి.ధన్యులమమ్మా!

4) అంశం:-వర్ణన
హరిహరాంశ సంభూతుడు అయ్యప్ప స్వామి మహాత్యమును సీసపద్యం లో వర్ణించండి.

పూరణ: వర్ణన

పంపానదీతీర పావన గిరులపై
ప్రభవించె నయ్యప్ప ప్రకృతిలోన
శబరిమలై నామ శబ్దము పలుకగా
సకల సౌఖ్యములన్ని సంభవించె
మకర సంక్రాంతి లో నొక దివ్య కాంతిగా
భక్తజనాళికి ప్రకటితమ్ము
ఇరుముడి ధరియించి యీప్సితార్థములకై
కాలవర్ణము లోన కదిలె భక్తి
నేలపై శయనమ్ము నిష్ఠాప్రపత్తులు
మండల దీక్షలు మహిమనీయ
వ్యాఘ్ర మాయన యెక్కెడి వాహనమ్ము
శత్రు ఖండన మా తండ్రి క్షాత్రమయ్యొ
కామ క్రోధము తొలగించు కాంతిరేఖ
హరికి హరునకు పుత్రుడయ్యప్ప యయ్యొ.

5) అంశం: ఛందోభాషణ;
మాడుగుల మురళీధర శర్మ సిద్ధిపేట

కరిముఖవరదుడుగణపతి
హరియించును విఘ్నములను ఆపదలందున్!
నిరుపమ గుణ సంపన్నుని
వరమే యీ మానవులకు వసుధాస్థలిపై!

6) అంశం..న్యస్తాక్షరి
సరస్వతీ రామశర్మ

కా మ ధే ను
చివరి అక్షరాలతో.
గోపూజ ఫలితం..
స్వేచ్ఛ వృత్తంలో

పూరణ: న్యస్థాక్షరి

ఆవు పూజ మనకు నారోగ్యరక్షకా
హారమైననేతియందు ప్రేమ
జరుగుతున్న దేమొ చాటుకు గోవధే
ధరణి గోవు పూజ ధన్యమౌను


7) అంశం: దృశ్యం - 1
అయాచితం నటేశ్వర శర్మ

ఈ దృశ్యంపై పద్యం రాయండి!

పూరణ: దృశ్యం - 1
ఎక్కువ యెండలు ముదురగ
మక్కువతో నగ్ని మీద మరి కాల్చకనే
మక్కలు పేలాలయ్యెను
చక్కని మన కామరెడ్డి సస్యములందున్.


7) అంశం - దృశ్యం - 2
పద్మజ రంగరాజు

అతి సామాన్యుని ప్రస్థానం వివరించండి....

పూరణ: దృశ్యం - 2

సామాన్యులు నాయకులై
సామాజిక బాధ దీర్ప సరగున సాగన్
ప్రామాణ్యము సేవలుగా
భూమాతకు సత్యమైన పుత్రులు వీరే.


8) అంశం: అశువు
సరస్వతీ రామశర్మ

అశోకవనిలో సీత

పూరణ: అశువు

రామచంద్రుని స్మరణలో రాణి సీత
యుండగానశోకవనమందొక్క కోతి
చేరియామెకు భక్తితో సేవజేసి
హనుమననిచెప్పిరాముని యునికి దెల్పె


కృతజ్ఙతలు:
కవులకు మిత్రవర్యులకు
గౌరవమొప్పెడి పండితాళికిన్
అవిరళ కావ్య పోషకులకాత్మసహోదరిశ్రేణికిన్నుమా
ధవుని సమస్త భక్తులకు తన్మయమొంది నమస్కరించెదన్.
కవనము నాల్గు పాదముల గావలె నీ శభ పద్యమందిదే

నేడొక గొప్పరోజు కరుణించెను శాంభవి వాణి లక్ష్మియున్
తోడుగ నిల్చిరందరును తోచినరీతిగ వ్రాయు పద్యమున్
కూడ ప్రశంస జేసితిరి కోమలమైన మనస్సు తోడుతన్
కూడిన మిత్రులందరికి గూర్చిన చేతుల వందనమ్మిదే.
--- మాడుగుల భాస్కర శర్మ


అభినందనపద్యం

చేసిరి పద్యమందు కనజేసిరి మాకిట గోవుమాతనే
వేసిన ప్రశ్నలంన్నిటికివవేగముగా పదమాలికా వలెన్
వాసిని పొంది మాడుగుల వంశమునందున మేటిగానిదే
భాసితమైన పూరణలు భాస్కరవర్యులు జేసిరిచ్చటన్..

సరస్వతీ రామశర్మ
🙏🙏🙏🙏


కృతజ్ఙతాభివందనాలు

మీపద్యం మాప్రశ్నకు
నేపథ్యము తోడవచ్చు నీసభ యందున్
జూపిన పదసుధ లందున
మీపాండిత్యము కనబడు మేధిని కృష్ణా
🙏🙏🙏
గోగులపాటి కృష్ణమోహన్
సమన్వయకర్త

         🌹🙏స్వస్తి🌹🙏

Comments

Popular posts from this blog

పద్యపూరణలు

చుక్కాయపల్లి శ్రీదేవి గారి పద్య పూరణలు

అవధాని బ్రహ్మశ్రీ అయాచితం నటేశ్వర శర్మ గారి పద్యపూరణలు